చీకిలి మాకిలి

చిందరవందర, చెల్లాచెదురు అనేలాంటి అర్థాల్లో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. కొన్ని జంటపదాలు జాతీయాలుగా ప్రచారంలోకొచ్చాయి. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. ఏవైనా వస్తువులు కానీ, పనులు కానీ ఒక వరుస క్రమంలో లేకుండా మనసుకు చికాకు కలిగించేలా ఉన్నప్పుడు ఈ ప్రయోగం ఈ సందర్భంగా కనిపిస్తుంటుంది.

కాటగలవటం

నశించటం అనేది దీనికున్న అర్థం. కాడు కలవటం అనే రెండు పదాల సమ్మేళనమిది. కాడు అనంటే శ్మశానం అని అర్థం. అందులో కలిసిపోయింది, ఏదీ ఇక తిరిగిరాదని, నశించి పోయినదేనని చెప్పడం సాధారణంగా వినిపించే అర్థమే. ఈ అర్థమే జాతీయంగా మారి ఏ పనైనా, వస్తువైనా నశించింది అని చెప్పాల్సి వచ్చినప్పుడు దీన్ని ప్రయోగించటం కనిపిస్తుంది.

వంతపాడటం

మనకున్న జాతీయాలలో కొన్ని జానపదుల కళాప్రక్రియను అనుసరించి కూడా వాడుకలోకి వచ్చాయనటానికి ఇదొక ఉదాహరణ. బుర్రకథ కళాప్రక్రియలో ప్రధాన కథకుడికి పక్కన వంతలుపాడే వారుంటారు. ప్రధాన కథకుడు చెప్పిన ప్రతిదానికీ తల వూపుతూ ఆ చెప్పిన దాన్నే మళ్లీ ఆహా ఓహో అంటూ చెబుతుంటారు. ఆ కళాప్రక్రియలో వంతపాడటం అంటే ఇదే. ఇదే జాతీయమయ్యేసరికి సొంత అభిప్రాయాలు లేకుండా ఎదుటివారు ఏంచెబితే దానికి తల వూపుతూ సమ్మతిస్తూ పోవటం అనే అర్థం ప్రయోగంలో కనిపిస్తుంది.

గద్దెనెక్కు

గద్దె అంటే సింహాసనం అనే అర్థం కనిపిస్తుంది. రాజులు, రాజ్యాలు ప్రస్తుత ప్రజాస్వామ్యంలో కనిపించకపోయినా పదవి అనే అర్థంలో గద్దె శబ్దం బాగా ప్రచారంలోకి వచ్చింది. గద్దెనెక్కించమంటే అధికారాన్ని అప్పగించటం లేదా గద్దెనెక్కు అంటే పదవిలోకి రావటం అనే అర్థాలు విస్తృత ప్రచారంలో ఉన్నాయి. 'ప్రజాభిమానాన్ని చూరగొన్న ఆయన అతితేలికగా గద్దెనెక్కగలిగాడు'లాంటి సందర్భాలలో ఈ జాతీయం కనిపిస్తుంటుంది. గద్దెనెక్కినవాడు అంటే అధికార పదవిని పొందిన వాడని, గద్దె దించటం అంటే అధికారం నుంచి తొలగించటమని, గద్దె దిగటమంటే పదవి నుంచి వైదొలగిపోవటమని ఇలా ఎన్నెన్నో రూపాలుగా ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

తవ్వి తలపోసుకోవటం

తవ్వటం, తలపోసుకోవటం అనే రెండు పదాల కలయిక ఈ జాతీయం. తవ్వటమంటే గతాన్ని తవ్వటం. ఎప్పుడో జరిగినదాన్ని గుర్తుకు తెచ్చుకోవటం అనేది భావన. తలపోసుకోవటం అంటే తలంటుకోవడం అన్నది ఇక్కడి అర్థం కాదు. ఆలోచించటం అని ఈ సందర్భానికి తగిన అర్థం. ఈ అర్థాల నేపధ్యంలో ఎప్పుడో జరిగిన విషయాలను మాటిమాటికీ గుర్తుతెచ్చుకొంటూ వాటి గురించే ఎవరైనా ఆలోచిస్తూ కాలక్షేపం చేస్తున్న సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

ఒట్టిగొడ్డు తాకట్టు

పనికిమాలిన పని, పూర్తిగా నష్టం తెచ్చిపెట్టే పని అనే అర్థాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. అప్పివ్వటం కోసం కొంతమంది వస్తువులను తాకట్టు పెట్టుకొంటుంటారు. అప్పులు తీర్చలేని పక్షంలో విలువైన ఆ వస్తువులను అమ్మి లాభపడుతుంటారు కొందరు తెలివైనవారు. అయితే అప్పుకోసం తిరుగుతున్న ఓ తెలివైనవాడు తెలివితక్కువవాడైన తాకట్టు వ్యాపారిని మోసం చేసాడట. పాడికి పనికిరాకుండా ఒట్టిపోయిన తన గొడ్డును తెచ్చి మాయమాటలు చెప్పి డబ్బు తీసుకువెళ్లాడు. పాడిగొడ్త్డెతే అప్పిచ్చిన వాడికి రోజూ పాలు పిండుకొని లాభపడే వీలుండేది. కానీ ఒట్టి గొడ్డును తాకట్టు పెట్టుకొన్నందువల్ల అది పాలివ్వకపోగా రోజూ దానికి మేతపెట్టాల్సి రాకవటంతో తాకట్టు వ్యాపారి నష్టపోయాడట. ఇలాగే ఎవరైనా మాయమాటలను నమ్మి మోసపోయినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.

కర్ణుడు లేని భారతం

ప్రధానుడు లేని కార్యం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. మహాభారతకథలో కర్ణపాత్రకు ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ జాతీయం అవతరించింది. ఓ పని జరిగేటప్పుడు దానికి సంబంధించిన ప్రధానమైన బాధ్యుడు లేదా వ్యక్తి ఉన్నప్పుడు ఉండే హంగూ ఆర్భాటం వేరు. అలాంటి వ్యక్తి లేనప్పుడు విషయం అనాసక్తంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాలను వర్ణించేందుకు ఈ జాతీయం ఉపయుక్తమవుతుంది.

కలలోని కాన్పు

అబద్ధం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. కల వాస్తవం కాదు. కలలో కనిపించిందంతా నిద్ర మెలకువ రాగానే కళ్లముందు కనిపించదు. అందుకనే కలను అబద్ధం అని అంటారు. కొంతమంది ఎంతో నమ్మకంగా జరగనివన్నీ జరిగినట్టు అబద్ధాలు చెబుతున్న సందర్భంలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది.

చందమామ గుటగుట

అందని వాటికోసం ఆశపడుతూ అవి అందినట్టే భావించుకుంటూ అవన్నీ అనుభవంలోకి వచ్చినట్టే ఆనందించటం అనేది ఈ జాతీయానికున్న అర్థం. నచ్చిన పదార్థాన్ని త్వరత్వరగా తినటాన్ని గుటగుట తినటం, గుటుకున్న మింగటం అనేది సంప్రదాయం. ఓ వ్యక్తి ఆకాశంలో ఉన్న చందమామను చూసి అదేదో పండుకానీ, తీపి పిండివంటకంకానీ అయిఉంటుందని అనుకోవటమేకాక ఆ పదార్థాన్ని తిన్నట్టు వూహించుకొని తృప్తి పడ్డాడట. ఇదే తీరులో ఎవరైనా ఆశగానో, అమాయకంగానో వ్యవరిస్తున్నప్పుడు ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది.

చంకదుడ్డు శరణార్థి

దుర్మార్గులు కొంతమంది పైకి వినయంగా నటిస్తూ నమ్మిన వారిని ఎప్పటికప్పుడు దెబ్బతీయాలని చూస్తుంటారు. ఓ వ్యక్తి దగ్గరకు శరణంటూ ఓ శరణార్థి వచ్చాడట. మామూలుగా రావటం కాక దుడ్డుకర్రను చంకలో పెట్టుకొని వచ్చాడు. ఆ కర్ర ఊతం కోసం కాక సమయం చిక్కినప్పుడు శరణు ఇచ్చిన వారిని కొట్టాలనే మోసపుటాలోచనతో తెచ్చుకున్న కర్ర. అలాగే ఎవరైనా పైకి వినయంగా నటిస్తూ లోలోపల శత్రుభావంతో ఉన్నారనిపించినప్పుడు వారిని గురించి చెప్పటానికి ఈ జాతీయాన్ని వాడుతుంటారు.

ఎగాదిగా

పైనుంచి కిందకి, కింది నుంచి పైకి అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఎగ అంటే ఎగువ, దిగ అంటే దిగువ అని అర్థం. ఈ అర్థాల క్రమంలో పైనుంచి కిందకు, కింది నుంచి పైకి చూశారు అని చెప్పటానికి ఈ జాతీయాన్ని వాడుతుంటారు. పైకి, కిందకి చూడటమంటే ఎదుటి వ్యక్తిని పూర్తిగా అంచనా వేసినట్టు లెక్క. అలా ఓసారి పైకి, కిందకి చూసి మంచివాడో చెడ్డవాడో, కావలసిన వాడో పరాయివాడో తెలుసుకొంటుంటారు కొందరు.

కానికూడు

నీతిబాహ్యంగా గడించిన సొత్తు అనేది దీనికున్న ప్రధాన అర్థం. ధర్మానికి కానీ, నీతికి కానీ, నియమాలకు కానీ లోబడి ఉండి సంపాదించని సంపదలను గురించి చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. ఇది ఉత్తమ సంపద కాదని అటువంటి నీతి బాహ్యమైన కానికూడు కోసం పాకులాడవద్దని పెద్దలు అంటుండటం వినిపిస్తుంటుంది.

కూటుక మూక

పైకి గంభీరంగా కనిపిస్తూ లోపల పిరికిపందలుగా ఉండే సమూహం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. పూర్వం ఉన్న రాచరిక వ్యవస్థ యుద్ధ సందర్భాల నుంచి ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. యుద్ధం జరిగే రోజుల్లో శత్రుసేన చేతిలో బాగా దెబ్బతింటున్న సైన్యం పిరికితనంతో పారిపోతుండేది. అలాంటి వారిని సేనాపతులు ఆపి ధైర్యం చెప్పి ఎలాగో ఒకలాగా మళ్లీ శత్రుసేన మీదకు వెళ్లేలా సేనావ్యూహాన్ని ఏర్పాటు చేస్తుండేవారు. వ్యూహంలో ఉన్న ఆ సేనలు దూరం నుంచి చూడటానికి ధైర్యంగా ఉన్నట్టు ఉండేవే కానీ వారి మనసులలో అపజయం, అభద్రతాభయాలుంటుండేవి. అదే తీరులో ప్రస్తుత కాలంలో కూడా ఎవరైనా కనిపించినప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు.

ముక్కూరవగచటం

ముక్కు, వూరటం, వగచటం అనే పదాల కలయిక ఈ జాతీయం. వగచటం అంటే ఏడవటం, దుఃఖించటం అని అర్థం. ఏడుపు ఎక్కువైనప్పుడు ముక్కుకారటం శారీరక సహజధర్మం. అంటే ఎంతో విపరీతమైన దుఃఖం కలిగితే తప్ప కళ్ల వెంట, ముక్కు వెంట నీరు కారేంతటి పరిస్థితి ఏర్పడదు. అందుకే ముక్కూరవగచటం అనే జాతీయానికి భరించరాని దుఃఖపరిస్థితి అనే అర్థం వ్యవహారంలోకి వచ్చింది.

గొడుగున్నోడు

గొడుగు + ఉన్నవాడు గొడుగున్నోడు రూపంగా అవుతుంది. పదిమందిలో ఉన్నప్పుడు దూరం నుంచి కావల్సిన వ్యక్తిని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఏదో ఒక ఆనవాలును చూపిస్తూ చెప్పటం అలవాటు. ఈ అలవాటే ఇలా జాతీయమైంది. సంస్కృతంలో కూడా ఛత్రిన్యాయం పేరున ఇది కనిపిస్తుంది. దూరంగా చాలామంది ఉన్నప్పుడు వారిలో ఓ వ్యక్తి చేతిలో గొడుగు ఉందట. ఆ గొడుగు ఉన్నవాడి గురించి చెప్పుకోవలసి వచ్చినప్పుడు 'అదుగో ఆ గొడుగున్నోడే మనోడు' అనటం కనిపిస్తుంది..

పందిరి మందిరమైనా సరే...

ఏ విధంగానైనా ఎంత కష్టంగానైనా సరే పనిని సాధిస్తాం అని చెప్పే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. పందిరి మందిరం కావటమంటే అసాధారణమైన విషయం. మందిర నిర్మాణానికి, పందిరి నిర్మాణానికి చాలా భేదం ఉంది. పందిరి సామాన్యంగా నాలుగుస్తంభాలతో పైన మామూలు ఆచ్ఛాదనతో ఉంటుంది. మందిరానికి గోడలు, దానికి తగిన పైకప్పులాంటివన్నీ ఉండాలి. పందిరిని మందిరం చేయాలంటే ఈ కోణంలో చూస్తే ఎంతో కష్టం. అంతటి కష్టమైన పనినైనా సరే మేం సాధిస్తాం అని ఎవరైనా గట్టిగా చెబుతున్నప్పుడు ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. ఆరునూరైనా, నూరుఆరైనా లాంటిదే ఇది.

పాము ముంగిసల్లా...

బద్ధవైరం ఉన్నవారిని, ఎప్పటికీ కలవనివారిని గురించి చెప్పాల్సినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. పాము, ముంగిస అనేవాటికి పుట్టుకతోనే వైరస్వభావం ఉంటుంది. అవి ఎప్పుడూ ఎక్కడా ఒకచోట కలిసిఉండవు. అలాగే ఎవరైనా ఇద్దరు వ్యక్తులు ఒకరిమీద ఒకరు భయంకరమైన పగ, ద్వేషాలతో ఉన్నప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు. సంస్కృతంలో వ్యాలనకుల న్యాయంగా ఇది ప్రచారంలో ఉంది.

మర్రి చెట్టుమీద దయ్యం

ఒక విషయాన్ని గురించి ఎవరైనా భయపెట్టినప్పుడు దానిలోని నిజానిజాలను తెలుసుకోకుండా కొందరు అనవసరంగా భయపడిపోతుంటారు. అలాంటి వారిని గురించి తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. ఓ వ్యక్తి దూరంగా ఉన్న దట్టమైన మర్రిచెట్టును చూపించి తన పక్కనున్న వాడితో మర్రిచెట్టు మీద దయ్యం ఉంది అని కొంటెతనానికి అన్నాడట. ఆ వ్యక్తి చెప్పిన దాన్లో నిజమెంత? అబద్ధం ఎంత? అసలు దయ్యాలు ఉంటాయా? ఉన్నాయా? అనేది విశ్లేషించి తెలుసుకోకుండా భయపడిపోయి ఓ అమాయకుడు పరుగెత్తాడట. ఎవరో చెప్పిన వాటికి భయపడిపోతూ బతికేవారిని గురించి చెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

గొంతుకలపటం

ఒకరు చెప్పిన దాన్ని అంగీకరించటం, ఏకాభిప్రాయాన్ని ప్రకటించటం, చెప్పినదానికి ఒప్పుకోవటం అనేలాంటి అర్థాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. గొంతు, నాలుక, నోరు ఇట్లాంటివన్నీ భావప్రకటనకు సూచనలు. ఒకరు ఒక భావాన్ని వెలిబుచ్చినప్పుడు అదే భావాన్ని బాగుందని సమర్థించటం గొంతుకలపటంగా అవుతుంది.

కరదీపికలాగా...

కరదీపిక అంటే చేతితో పట్టుకున్న కాగడా, దీపం అని అర్థం. కాగడా కానీ, దీపంకానీ వాటివల్ల వాటికి ఏ ప్రయోజనమూ ఉండదు. అది ఇచ్చే కాంతితో ఎదుటివారు ఆనందిస్తుంటారు. దీన్నే మరొకలాగా కొవ్వొత్తితో పోల్చిచెప్పటం కూడా ఉంది. కొవ్వొత్తి తాను కరుగుతూ చుట్టూ ఉన్న వారికి వెలుగునిస్తుంది. ఇలా ఈ జాతీయం నిస్వార్థపరులను గురించి, త్యాగమూర్తులను గురించి తెలియచెప్పేటప్పుడు ప్రయోగంలో కనిపిస్తుంది.

రేవు ఎరిగి పోవాలి

నదీప్రయాణాలు నేపథ్యంలో అవతరించింది ఈ జాతీయం. నదిని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు దాటేటప్పుడు ఎక్కడ రేవు ఉంటే అక్కడ ఒడ్డెక్కి అవతలకు పోవటం సులువని పెద్దలు చెబుతారు. రేవు ఎక్కడుందో తెలుసుకోకుండా ఎలాబడితే అలా అవతలి ఒడ్డుకు చేరుకోవాలనుకోవడం ప్రమాదకరమైన విషయం. అంటే జీవితాన్ని సాగించేటప్పుడు శ్రేయస్కరమైన గమ్యాన్ని తెలుసుకొని ఆ రంగంలో ఆ గమ్యం వైపు అడుగులేయాలి. అప్పుడే జీవితం సుఖవంతమవుతుంది. అనే భావనకు ప్రతిరూపంగా ఈ జాతీయాన్ని వాడుతుంటారు.

పీటముడి

క్లిష్టసమస్య అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఒక్కోసారి కొన్ని సమస్యలకు పరిష్కారం దొరకకపోగా నానాటికీ అవి ఎక్కువవుతుంటాయి. ఈ తీరును దారాలుకానీ, పురికొసలు, దండలు వంటివికానీ మన ప్రమేయం లేకుండా ముడిపడిన తీరుతో పోల్చిచెప్పటం గమనార్హం. కొన్నిసార్లు పడిన ముడులు జాగ్రత్తగా గమనిస్తూ విడదీస్తే విడిపోతుంటాయి. కానీ కొన్నిసార్లు ఒక కొసలాగబోయి మరొక కొసలాగినప్పుడు ముడి విడివడదు. ఇలాంటి స్థితిని పీటముడి పడటం అంటారు. ఈ స్థితిని పోలికగా తీసుకుని ఏదైనా సమస్యను పరిష్కరించపోయినప్పుడు అది మరింతగా క్లిష్టంగా తయారైతే దాన్ని పీటముడిపడింది అంటుంటారు. ఇది పీటముడిలాంటి సమస్య. దీన్ని అధిష్ఠానమే విప్పలేకపోయింది అనేలాంటి సందర్భాలలో దీన్ని గమనించవచ్చు.

వేలు మడవటం

లెక్క పెట్టడం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. చాలా సందర్భాలలో ఎన్ని? ఎంతమంది? అని లెక్క చూసేటప్పుడు చేతివేళ్లను ఒక్కొక్కటిగా మడిచి లెక్కపెడుతుంటారు. స్వభావసిద్ధమైన ఈ మానవ వ్యవహారశైలి ఇలా జాతీయం అయింది.

పెద్దగొడ్డలి నొక్కుపోవటం

సహాయాన్ని అందించేవారు దూరం కావటం, ఏదైనా పని తలపెట్టినప్పుడు ఆ పని పూర్తయ్యేందుకు అడ్డంకులు ఏర్పడటం, విపరీతమైన నష్టం అనేలాంటి అర్థాలలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. పూర్వకాలంనాటి సాధనలలో గొడ్డలి కూడా ఒకటి. ఈ గొడ్డళ్లలో పెద్ద, చిన్న రకాలు ఉంటాయి. పెద్దగొడ్డలి అంటే పెద్దపెద్ద మొద్దులను సులభంగా నరికి కావలసినట్టు ఉపయోగించుకోవచ్చు. నొక్కుపోవటం, మొక్కవోవటం ఇలాంటివన్నీ గొడ్డలి పదును పోయిందని, గొడ్డలి విరిగిందని చెప్పాల్సి వచ్చినప్పుడు అనే మాటలు. ఈ భావనతోనే పెద్దగొడ్డలి నొక్కుపోవటం అంటే పెద్దదిక్కుగా ఉండేవారు దూరమయ్యారనే అర్థంతో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది.

చేతులు పిసుక్కోవటం...

దైన్యస్థితిని ప్రదర్శించటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. మనిషి శారీరకంగా కొన్నికొన్ని భావాలను ప్రదర్శించేటప్పుడు కొన్నికొన్ని చేష్టలను చేస్తుండటం సహజం. ఎదుటివారి దగ్గర దీనంగా ఏదైనా సహాయాన్ని అర్థించేటప్పుడు, ఎదుటి వారికంటే తాను తక్కువ స్థితిలో ఉండి మాట్లాడుతున్నప్పుడు రెండు చేతులను పనున్నా లేకపోయనా దగ్గరకు తీసుకుని ఒకచేత్తో మరొకచేతిని ఒత్తుకుంటూ ఉండటం కనిపిస్తుంది. ఇది వ్యక్తి స్వాభావికమైన చర్య. ఈ చర్యే జాతీయ రూపంగా అవతరించింది.

చేతిలోనివాడు

సొంతమనిషి అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. చేతిలో ఉన్నదేదైనా సొంతం అనే భావన ఉంటుంది. అందుకే చేతిలోని మనిషి అనంటే సొంతమనిషి, నమ్మకస్థుడు అనేలాంటి అర్థాలు ప్రచారంలొకొచ్చాయి.

వంచిన నడుము ఎత్తకుండా...

అవిశ్రాంతంగా అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పనిని ప్రారంభించడం అని చెప్పటానికి నడుమొంచడం అనే పదాన్ని వాడటం అలవాటుగా ఉంది. కాస్తంత నడుమొంచి పనిచేయి, వీడి పనంటే చాలు నడుమొంగదు ఇలాంటి ఇలాంటి ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఈ క్రమంలోనే వంచిన నడుము ఎత్తకుండా అనంటే ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా పని చేయటం అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు.

నఖశిఖ పర్యంతం

సంపూర్ణంగా అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. కాలి గోటి నుంచి నెత్తిమీద ఉన్న జుట్టు దాకా అని దీని అసలు అర్థం. అంటే ఒక మనిషిని వర్ణించేటప్పుడు సంపూర్ణంగా ఎలా వర్ణిస్తారో అదే తీరులో ఒక వర్ణనను చేసేటప్పుడు పూర్తిగా చేశాము అని చెప్పటానికి ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ప్రత్యేకంగా పరిశీలన, పరీక్ష ఇలాంటి సందర్భాలలో సంపూర్ణతను సూచించడానికి ఈ జాతీయ ప్రయోగం చేయటం కనిపిస్తుంది.

చమట పిండటం

కష్టపెట్టి పని చేయించడం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. చమటోడ్చి అనే రూపం కూడా ఉంది. శ్రమిస్తే దేహానికి చమట పట్టడం సహజం. శ్రమ బాగా ఎక్కువైతే చమట కూడా ఎక్కువవుతుంది. ఈ కోణంలో చమట పిండటం అనంటే తడి వస్త్రాన్ని పిండినప్పుడు ధారగా నీరుకారిన స్థితి భావనలోకి వస్తుంది. పిండటమంటే బాగా కష్టపెట్టడం అనే అర్థం ఈ జాతీయం వాడుకలో ధ్వనిస్తుంది. మొత్తం మీద ఎవరినైనా బాగా కష్టపెట్టి మరొకరు పని చేయిస్తున్న సందర్భాలలో చమటపిండి వదిలిపెట్టారు అని అనటం వాడుకలో ఉంది.

పులిస్వారీ...

ప్రమాదభరితమైన పని అనే అర్థంలోనూ, సాహస కృత్యాలు అనే అర్థంలోనూ ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పులిని దూరం నుంచి చూడాలన్నా భయమే. అలాంటిది పులిని పట్టుకొని దానిమీద ఎక్కి స్వారీ చేయడమంటే ఎంత ప్రమాదభరితమైన వ్యవహారమో, ఎంతటి సాహసకృత్యమో ఎవరైనా వూహించవచ్చు. అలాంటి సాహసకృత్యమని ఏది అనిపించినా ఆ పని చెయ్యడానికి పూనుకున్నవారిని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు.

అగ్నిపిండం

నిప్పులాంటి మనిషి అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. దుడుకు పిండం అనే ప్రయోగం ఇంకొకటి ఉంది. అంటే దుడుకుగా వ్యవహరించే వ్యక్తి అని అర్థం. ఇదే తీరులో అగ్నిపిండం అంటే నిప్పులాంటి వాడన్నది భావన. నీతినిజాయితీలకు, నిజానికి, స్వచ్ఛతకు మారుపేరుగా నిప్పును సూచిస్తారు. అలాంటి అర్ధంలో స్వచ్ఛమైనవాడు అనే ప్రయోగం కనిపిస్తుంది. అయితే దీన్ని కొంతమంది సమీపానికి వెళ్లినవారిని ఎవరినైనాసరే తన సహజలక్షణంతో కష్టపెట్టేవాడు అనే అర్థంలో కూడా ఈ జాతీయాన్ని అక్కడక్కడా వాడటం కనిపిస్తుంది.

తునిమి తూటాడటం...

తునటము అనంటే కొయ్యటము లేదా సంహరించటం అని అర్థం. తనుము అనే పదమే తుంపు అనే రూపంగా కూడా కనిపిస్తుంది. తూట అంటే రంధ్రం అని అర్థం. తూటాడటమంటే రంధ్రాలు పడేలా కొట్టడం. మొత్తం మీద ఈ జాతీయం.. మహాభయంకరంగా కొట్టి సంహరించిన సందర్భాలలో ప్రయోగిస్తారు. 'వాడి జోలికివెళితే తునిమి తూటాడుతాడు జాగ్రత్త' అనేలాంటి ప్రయోగాలున్నాయి.

బండెడు

అధికం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పూర్వం వస్తువులను లేదా ధాన్యంలాంటి వాటిని గంపలకు, బండ్లకు ఎత్తించి పంపుతుండేవారు. గంపలకు ఎత్తినదానికన్నా బండినిండా వేసినవి ఎంతో అధికంగా ఉంటుంది. ఇలా ఉన్నదాన్ని గమనించి ఆ భావనతో దీన్ని జాతీయంగా ప్రయోగంలోకి తెచ్చారు పూర్వులు.

తోక తెగకోయటం

అవమానించటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. కుక్కలాంటి జంతువుల విషయంలో కొన్నిసార్లు వాటి చెవులను, తోకను కత్తిరిస్తుంటారు. అలా చేయడం వల్ల వాటి ప్రవర్తనలో మార్పు వస్తుందన్నది భావన. ఇదే మనిషి విషయంలోకి వచ్చినప్పుడు అంతకు ముందెవరైనా పొగరుమోతుతనంతో కానీ, పెడసరంగా కానీ ఉన్నప్పుడు వాడి పొగరును తగ్గించేందుకు తగిన అవమానం జరపటాన్ని తోక తెగకోయడం అని అనటం కనిపిస్తుంది.

శూర్పణఖ మేనకోడలు

మేనమామ, మేనత్తల పోలికలు బిడ్డలకొస్తాయన్నది ఓ నమ్మకం. ఈ నమ్మకం ఆధారంగా ఈ జాతీయం ప్రయోగంలోకొచ్చింది. రామాయణకథలోని పాత్ర శూర్పణఖ. రావణాసురుడి చెల్లెలైన ఈమె రాక్షసస్వభావం, వంచన తత్వంతో కనిపిస్తుంది. ఇటువంటి స్వభావాలు స్త్రీలలో ఎవరి దగ్గరైనా కనిపించినప్పుడు ఈ జాతీయంతో సూచించటం ప్రయోగంలో ఉంది.

కుక్క నిద్ర

కుక్క ప్రవర్తన అనేక విధాలుగా జాతీయాలుగా అవతరించింది. కొన్నిసార్లు నీచమైన జంతువుగా కుక్కను చెబుతుంటారు. అలాగే విశ్వాసానికి మంచి ఉదాహరణగా కూడా పేర్కొంటారు. నీచత్వం, విశ్వాసంతోపాటు తనది అని భావించిన కాపలా విషయంలో కానీ తన ఆత్మరక్షణ విషయంలోకానీ కుక్కకున్న చురుకుదనం కూడా జాతీయంగా అవతరించింది. కుక్క తోకను ఎప్పటికీ సరికాని వంకరబుద్ధికి ప్రతీకగా చెబుతారు. దాలిగుంటలో పడుకొని లేచిన కుక్కను ఎప్పటికప్పుడు బుద్ధి మార్చుకొనే తత్వానికి ప్రతీకగా వివరిస్తారు. ఈ జాతీయంలో జాగ్రత్తగా వ్యవహరించే తీరు కనిపిస్తుంది. కుక్క గుర్రుపెట్టి ఎవరెంతసేపు లేపినా లేవకుండా ఉండేలాగా నిద్రపోదు. ఏ మాత్రం అలికిడైనా మేల్కొని జాగ్రత్తపడుతుంది. అలాంటి జాగ్రత్తపడే తత్వానికి, అతిగా నిద్రపోకుండా మొద్దుగా వ్యవహరించకుండా ఉండే తత్వానికి సూచనగా ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.

ఎరలేని గాలం

వ్యర్థ ప్రయత్నం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. గాలానికి ఎరను గుచ్చి వేట ప్రారంభించినప్పుడే చేపలు గాలానికి చిక్కుతాయి. ఎర లేకుండా ఒక్క గాలాన్నే వదిలితే దానివల్ల ప్రయోజనమేమీ ఉండదు. అలాగే ఒక లక్ష్యాన్ని చేరాలనుకొన్నప్పుడు దానికి తగిన సాధనాలన్నిటినీ సమకూర్చుకొని ముందుకు నడవాలి. అంతేకానీ ఏమీ లేకుండా వెళితే పని జరగదు అనే విషయాన్ని వివరించే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

కాడి కిందెయ్యటం...

చేస్తున్న పనిని మధ్యలోనే ఆపేయటం అనే అర్థంలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. వ్యవసాయ నేపథ్యం నుంచి ఇది ఆవిర్భవించింది. ఎద్దులను నాగలికి కట్టాలన్నా, బండికి కట్టాలన్నా వాటి మెడల మీద కాడిని ఉంచుతారు. అవి పని చేస్తున్నంతసేపూ కాడిని మోస్తూనే ఉంటాయి. ఎద్దు కాడిని కిందపడేసిందంటే దానర్థం పని ఆగిపోయిందని. ఈ అర్థంతోనే చేస్తున్న పనిని ఆపేశారు అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

సిగపట్లు

'శిఖ' అనే శబ్దమే వాడుకలో 'సిగ'గా అయింది. శిఖ అంటే నెత్తిమీది జుట్టు అని అర్థం. తగాదా ఆడుకొనే సందర్భాలలో జుట్టూజుట్టూ పట్టుకొని గింజులాడుకుంటూ ఒకరితో ఒకరు కొట్లాడుకుంటూ ఉండటం కనిపిస్తుంది. ఈ కొట్లాటే సిగపట్టు. తగాదా అనేది ఓ విషయంలో ఇద్దరి మధ్యన వచ్చిన అభిప్రాయం బేధాన్ని సూచిస్తుంది. ఈ జాతీయం నిజంగా జుట్టూజుట్టూ పట్టుకొని కొట్టుకోకపోయినా, ఓ విషయం మీద ఇద్దరు భిన్న అభిప్రాయాలతో ఉండి ఎవరికి వారు వారు చెప్పిందే వాస్తవమని గట్టిగా చెబుతున్న సందర్భాలలో కూడా ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

బురదలోపడ్డ పోట్లగిత్త...

బలవంతుడికి, శౌర్యవంతుడికి కొన్నికొన్నిసార్లు అనుకోకుండా కొన్ని కష్టాలు వస్తుంటాయి. ఎంత శక్తిమంతులైనా తనకు తెలియకుండా వచ్చిపడ్డ కష్టాలకు ఎంతోకొంత బాధపడవలసిందే. ఈ విషయాన్నే తెలియచెబుతుంది ఈ జాతీయం. పోట్లగిత్త అలాంటి శక్తిమంతుడిలాంటిదే. కయ్యానికి కాలు దువ్వుతూ ఎదుటి గిత్తలను చిత్తుచేస్తుంది. అయితే ఏం... ఓసారి అది వెళ్లే దోవలో కొద్దిగా లోతుగా ఉన్న బురద గుంతలో పడాల్సివచ్చిందట. అంతటి పోట్లగిత్త బురదలో నుంచి బయటకు రావటానికి పడాల్సిన ఇబ్బందులన్నీ పడింది. ఇదే తీరులో తెలియకుండా వచ్చిపడ్డ కష్టాలనుంచి బయటపడేందుకు పెద్దలు, బలవంతులు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.

నీళ్లు చల్లటం

నిరుత్సాహపచటం, తగ్గించటంలాంటి అర్థాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పాలపొంగును ఉత్సాహంతో పోల్చినప్పుడు పొంగుమీద నీళ్లు చల్లితే పొంగు చల్లారటాన్ని నిరుత్సాహపరచటంగా భావించటం వల్ల ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. అలాగే దుమ్ము రేగుతున్నప్పుడు నీళ్లు చల్లితే దుమ్ము అణుగుతుంది. ఇలాంటి ఉదాహరణలను దృష్టిలో ఉంచుకొని నిరుత్సాహపరచటం. శాంతపచటం, అణచటంలాంటి అర్థాల్లో ఈ జాతీయాన్ని వాడుతుంటారు.

పేగులెండగట్టడం

ఆహారం పెట్టకపోవడం, సరిగా ఆహారాన్ని తినలేనిస్థితి, శ్రమకు తగిన ప్రతిఫలాన్ని ఇవ్వకుండా ఆపడం లేదా మోసం చేయడం అనేలాంటి అర్థాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. సర్వసాధారణంగా ఆహారం తీసుకొనే వ్యక్తికి పేగులు జీర్ణక్రియతో తడిగా ఉంటాయన్నది భావన. పేగులకు ఆహారం అందకపోతే అవి ఎండిపోతాయని సామాన్యజనం అనుకొంటుంటారు. అందుకే ఈ జాతీయం ఆహారాన్ని పెట్టకపోయినా, ఆశించిన ఫలితం దక్కని సందర్భాలలోనూ ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది.

తాబేలు తీరు

తాబేలులాగా ఉండటం అన్నది దీనికి ఉన్న అర్థం. అంటే తాబేలు నడిచినట్లు నిదానంగా నడవడం కాదు. తాబేలుకు ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నదని అనిపించినప్పుడు తన అవయవాలన్నింటినీ డిప్ప లోపలికి లాక్కుని ముడుచుకుని ఉంటుంది. ఈ తీరులో మనిషి ఉండటం మేలంటారు పెద్దలు. అంటే కోర్కెలను అదుపులో పెట్టుకుంటూ వాటిని ఎప్పుడూ ఎక్కడా బహిర్గతం చేయకుండా ఉండాలన్నది దీనిలోని అంతరార్థం. ఆ అర్థాన్ని ప్రకటించాల్సి వచ్చిన్నప్పుడు తాబేలు తీరులో ఉండటం మేలు సుమా అని అంటుండటం కనిపిస్తుంది.

అంటకత్తెర వేయటం

ఎక్కువగా కోత విధించటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. మామూలుగా పురుషులు కేశాలంకరణ కోసం తగినంతగా శిరోజాలను కత్తెర వేయించుకుంటే చూడటానికి అందంగా ఉంటుంది. కానీ కొన్ని కొన్ని సందర్భాలలో కొంతమంది శిరోజాలను అధికంగా అంటే ఎక్కువ నిడివి లేకుండా బహుకొద్దిగా మాత్రమే ఉండేలా కత్తెర వేయించుకున్న పద్ధతిని అంటకత్తెర వేయటం అనే పదం వాడుతుంటారు. ఈ పదభావాన్ని ప్రతిబింబిస్తూ ప్రభుత్వాలు కొన్నికొన్ని పథకాలకు సంబంధించిన నిధులను విపరీతంగా తగ్గించినప్పుడు ఈ జాతీయాన్ని ప్రయోగించటం కనిపిస్తుంది.

అత్తగారి సాధింపు

అత్తగార్లంతా గయ్యాళివారేనన్న భావన ఉన్న సమాజం నుంచి ఈ జాతీయం ఉద్భవించింది. కోడలు ఎంత అణిగిమణిగి ఉన్నా, ఎంత బాగా పనిచేసినా అత్త స్థానంలో ఉన్న మహిళకు తృప్తి ఉండదంటారు. అలాగే ఆమె కోడలిని సాధించటం కూడా ఎక్కువేనంటారు. ప్రతిదానికీ విసుక్కోవటం, చులకనగా మాట్లాడటంలాంటివి సాధింపులో ఉన్న కొన్ని లక్షణాలు. ఈ లక్షణాలతో ఎవరు ప్రవర్తిస్తున్నా వారి తత్వాన్ని గురించి చెప్పాల్సివచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుండటం కనిపిస్తుంది.

ఉక్కు తునకలు

శౌర్యవంతులు, ప్రతాపవంతులు అనే అర్థాలలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. ఉక్కు దృఢత్వానికి ప్రతీక. తునక అంటే ముక్క అని అర్థం. అంటే ఉక్కు ముక్కలాగా శరీరధారుఢ్యంలో కానీ, మనస్త్థెర్యంలోకానీ బలవంతులు అని అర్థం. ఎవరినైనా దృఢసంకల్పం కలవారిని, మంచి తెలివితేటలున్నవారిని, బలవంతులను గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.

దీపాలార్పే బుద్ధి

ఇతరులను నాశనం చెయ్యటం, క్రూరంగా ప్రాణాంతకంగా ప్రవర్తించటం అనే అర్థాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. హాయిగా, ఆనందంగా జీవించే మనిషిని వెలిగే దీపంతో పోల్చి చెబుతుంటారు. అలాంటి మంచి మనుషులను ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెడుతూ వారి జీవితాలను కొంతమంది దుర్మార్గులు నాశనం చేస్తుంటారు. అలాంటి వారిని గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. 'వాడిదొట్టి దీపాలార్పే బుద్ది కాకపోతే మరేమిటి చెప్పండి లేనిపోనివన్నీ చెప్పి అతడి మనస్సు విరగ్గొట్టి శాంతంగా బతికే ఆయనకు ఆత్మహత్య చేసుకునేలా చేశాడు' అనే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

ఒంటి మీదికి రావటం

ఆవేశంతో మాట్లాడటం, విపరీతమైన కోపాన్ని, ఆగ్రహాన్ని ప్రకటించటం అనేలాంటి అర్థాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పూనకం వచ్చినప్పటి భావావేశస్థితిని దృష్టిలో వుంచుకొని ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. ఒంటి మీదికి రావటమంటే ఏదో ఒక దేవతో, దేవుడో ఆవహించినట్టు మాట్లాడుతుంటారు. సర్వసాధారణంగా ఆ మాటలు మితిమీరిన ఆవేశంతోనే ఉంటాయి. అలా విడిగా కూడా ఎవరైనా ప్రవర్తిస్తున్నప్పుడు ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది.

రంగు పులమటం

కల్పించి చెప్పటం, మోసం చేయటం అనేలాంటి అర్థాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. సహజసిద్ధంగా ఉన్న రంగు కాక ఒక వస్తువుకు కృత్రిమంగా మరో రంగు వేస్తే అంతకుముందున్న రంగు మరుగున పడుతుంది. తెలుపు రంగు స్వచ్ఛతకు, నలుపు రంగు మురికికి ఉదాహరణలుగా చెప్పుకోవటం మానవ సమాజంలో అలవాటుగా ఉంది. స్వచ్ఛంగా నీతినిజాయితీలతో ఉన్న వ్యక్తిని తెల్లరంగుకు ఉదాహరణగా తీసుకుంటే అతడి మీద కసికొద్దీ అతడికి దుర్మార్గాలను అంటకట్టడం, చెడ్డ మనిషని ప్రచారం చేయటం అనేది నల్లరంగు పులమటానికి ప్రతీకగా చెప్పవచ్చు. ఈ భావంతోనే రంగు పులమడమంటే మంచి వ్యక్తిని చెడువ్యక్తిగా ప్రచారం చేయడం అనే అర్థం వ్యాప్తిలోకి వచ్చింది.

బాలింత పులి

క్రూరస్వభావంతో స్వార్థంగా ప్రవర్తించేవాడు అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పులి ఈనగానే ఎంతో ఆకలితో ఉంటుంది. ఆ ఆకలిని తీర్చుకొనేందుకు అది అప్పుడే పుట్టిన తన పిల్లలను కూడా తినేస్తుంది. పులికి ఇక్కడ తన స్వార్థం తప్ప మరేమి అనిపించదు. అలాగే తన పని కావటానికి ఎంతటి ఘోరానికైనా తెగించే వ్యక్తులను గురించి, వారి మనస్తత్వాలను గురించి తెలియచెప్పే సందర్భంలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

తలపై తల రావటం

అందరికన్నా ఎక్కువ తెలివితేటలు కలిగి ఉండటం, అప్పటిదాకా ఉన్న తెలివికన్నా ఇంకా ఎక్కువ తెలివి కలవారిగా కనిపించటం అనేలాంటి అర్థాల్లో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తోంది. తల కలిగి ఉండటం అనంటే తెలివి కలిగి ఉండటం అని అర్థం. తల కేవలం శరీరంలోని ఓ అంగం మాత్రమే కాదూ అది తెలివితేటలకు చిహ్నం. తలలోని మెదడు ఆలోచనకు సంబంధించి ఉంటుంది. కనుక ఆ భావనతో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

అంటగట్టడం...

బలవంతంగా ఇవ్వడం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. ఇష్టం ఉన్నా లేకపోయినా చాలా సందర్భాలలో మొహమాటానికో మరొక ప్రలోభానికో లొంగి ఎదుటివారి మాటల వలలో చిక్కుకోవటం జరుగుతుంటుంది. కొంతమంది తమ తెలివితక్కువతనం వల్లకూడా ఇలా ఎదుటివారి వలలో చిక్కుకొంటారు. ఆ పరిస్థితులలో వారు అతితక్కువ ధర ఉండే వస్తువులను కానీ, ఇతర పదార్థాలను కానీ అధిక మొత్తం చెల్లించి కొనడం జరుగుతుంటుంది. ఇలా తక్కువ వెల ఉన్నవాటిని ఎక్కువ వెలతో కొనడంలాంటి సందర్భాలలో ఈ అంటగట్టడం అనే జాతీయం ప్రయోగిస్తుంటారు.పావలా విలువ చేసేదాన్ని రూపాయిపావలా అని చెప్పి నాకు అంటగట్టి నన్ను వాడు మోసం చేశాడు అని చెప్పే సందర్భాలు మనకు కనిపిస్తుంటాయి.

చుక్క తెగిపడ్డట్టు..

అనుకోకుండా అకస్మాత్తుగా వచ్చే వారిని గురించి చెప్పుకొనేందుకు ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ఆకాశం నుంచి అప్పుడప్పుడు ఉల్కలు రాలిపడుతుంటాయి. రోదసిలోని ఉల్కలు భూవాతావరణంలోకి ప్రవేశించగానే మండిపోయి నశిస్తాయి. ఈ ఘట్టాన్ని దూరం నుంచి చూసేవారికి ఆకాశం నుంచి నక్షత్రాలే రాలి పడిపోతున్నాయేమో అనిపిస్తుంది. ఇలా ఉల్కాపాతం జరగటానికి ఒక రోజని, ఒక సమయం అని ఏదీ ఉండదు. అలాగే ఏ అర్థరాత్రి వేళో, ఇంటికెవరైనా అనుకోకుండా వస్తే చుక్క తెగిపడ్డట్టు వచ్చి పడ్డాడని అనుకోవటం కనిపిస్తుంటుంది.

నోట్లో శని...

ఉండీ అనుభవించలేని స్థితిని ఈ జాతీయంతో సూచిస్తారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అనే సామెత కూడా తెలుగునాట బహుళ ప్రచారంలో ఉంది. శని అనేది శనిగ్రహ సూచకం. శని పట్టిన వాళ్లు ఎటువంటి సుఖసంతోషాలకు నోచుకోరన్నది ఓ నమ్మకం. ఆ నమ్మకం ఆధారంగానే ఈ జాతీయం ఆవిర్భవించింది. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నా కొన్నికొన్నిసార్లు కారణాంతరాలవల్ల అనుకున్న పని జరగదు. ఇలాంటి సందర్భాలలో 'అందరూ అన్ని సాయాలూ చేసారు. కానీ వాడి నోట్లో శని. ఏం చేస్తాం పాపం వాడికి కలిసిరాలేదు' అంటాం.

పనిపట్టడం...

అదుపుచేయడం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పని అంటే ఓ వ్యక్తి చేస్తున్న ఏదైనా ఒక పని అని అర్థం. ఆ పని దుర్మార్గతత్వంతోనూ, ఆమోదయోగ్యంగా లేకుండానూ ఉన్నప్పుడు అతడిని ఎదుటివారు అదుపుచేస్తారు. పట్టడం అనంటే క్రియావాచకంగా చూసినప్పుడు పట్టి ఆపడం అని అర్థం వస్తుంది. ఇలా ఆమోదయోగ్యంకాని పనులను చేసేవారిని అదుపుచేయటం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలోకి వచ్చింది.

దశ తిరగటం

కాలం కలిసిరావటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. ఇది జ్యోతిషశాస్త్ర సంబంధంగా ఆవిర్భవించిన జాతీయం. జ్యోతిషం ప్రకారం కొంతమందికి కొన్ని గ్రహాల దశలు అనుకూలంగా ఉంటాయన్నది నమ్మకం. ఆ అనుకూల కాలంలో ఏ కార్యం తలపెట్టినా చాలా సులువుగా విజయం లభిస్తుందని అంటారు. ఈ భావన ఆధారంగా అప్పటిదాకా ఎన్నెన్నో కష్టాలను అనుభవించి ఏ కారణం చేతనైనా ఒక్కసారి సంపదలు రావటమో, సుఖాలు ప్రాప్తించటమో జరిగితే ఆహా వీడి కష్టాలు ఇన్నాళ్లకు తీరాయి. వీడి దశ తిరిగింది. అని అనేలాంటి సందర్భాలలో ఈ జాతీయం వినిపిస్తుంది.

వరిగడ్డి మంట

ఎక్కువకాలం నిలవనిది అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. వరిగడ్డి మంట కట్టెల మంటలాగా ఎక్కువసేపు ఉండదు. బాగా మండి చప్పున ఆరిపోతుంది. ఈ భావాన్ని ఆధారంగా చేసుకొని అప్పటికప్పుడు బాగా కోపం తెచ్చుకొని మరుక్షణంలో శాంతించేవారి తత్వాన్ని ఈ జాతీయంతో పోల్చి చెబుతారు.

ఇంట్లో పులి.. వీధిలో పిల్లి!

మన తెలుగు సంప్రదాయంలో కొన్నికొన్ని జంతువుల తత్త్వాలను రాజసానికి ప్రతీకగా, మరికొన్ని జంతువుల ప్రవర్తనను నూన్యతాభావానికి, లోకువకు ప్రతీకగా మనవారు పోలికగా చెప్పటం కనిపిస్తుంది. పులి, ఎద్దు ఇలాంటి జంతువుల స్వభావాలు పురుష వ్యాఘ్రం, యోగి పుంగవుడులాంటి పదాలుగా వాడుకలో మనకు కనిపిస్తాయి. ఈ జాతీయంలో ఇంట్లో పులి అని అనటంలో ఈ వ్యక్తి కుటుంబసభ్యుల నడుమ మాత్రమే గొప్పవాడిగా ఉంటాడని నలుగురిలోకి వస్తేమాత్రం అతడు అణిగిమణిగి ఉంటాడనే విషయం స్పష్టమవుతుంది. ఇదే జాతీయం తారుమారుగా కూడా చెప్పటం కనిపిస్తుంది. ఇంట్లో పిల్లి, వీధిలో పులి అనికూడా ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. అంటే ఇంట్లో అణిగిమణిగి ఉండి వీధిలోకి వస్తే మాత్రం ఎంతో రాజసంగా, హుందాగా కనిపించే వ్యక్తులను గురించి మాట్లాడుకోవటానికి ఈ తరహాలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు.

రోకటి చిగుళ్లు కోయటం..

అసంభవమైన లేదా జరగని పని అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. రోకలిని చెట్టు మాను నుంచి తయారుచేస్తారు. చెట్టునో, కొమ్మనో నరికి దాన్ని ఎండపెట్టి ఆ తర్వాత రోకలిగా చెక్కి రూపొందిస్తారు. ఇంత జరిగాక ఆ చెట్టు మానుకానీ లేదా కొమ్మకానీ మళ్లీ చిగురు పెట్టడం అనేది జరగదు. రోకలికి చిగురుపెట్టిందని, దాన్ని కోశామని ఎవరైనా చెబితే అది ఎంత నమ్మలేనిపనో ఎవరైనా జరగని పని జరిగిందని చెబుతున్నప్పుడు ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది.

తేనె తీసినవాడు చెయ్యి నాకకపోడు..

ఎంతో కొంత స్వార్థం లేనిదే ఎవరూ ఏ పనీ చేయరు అని అనుకొనే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. చెట్టెక్కి జాగ్రత్తగా తేనెపట్టును పట్టి తీసుకొచ్చి తేనె తీసినవాడి చేతికి తేనె అంటితీరుతుంది. దాన్ని కడిగినందువల్ల లాభమేమిటని ఆ తేనెను ఆ వ్యక్తి నాకటం సహజం. ఈ ఉదాహరణను ఎవరి పనిమీదనన్నా వెళ్లి పని చేసుకొచ్చినవాడు ఎంతోకొంత తాను మిగుల్చుకొని ఉంటాడని అనుకొనే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది.

ముతకతనం..

మోటుగా ఉండటం, సభ్యంగా కాక అశ్లీలంగా ఉండటం అనేలాంటి అర్థాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ముతకతనం అనేది భాష, సంస్కృతి, వ్యవహారంలాంటివాటి విషయాలలో ఉన్నప్పుడు తక్కువతనంగా భావిస్తుంటారు. ముతక భాష అనంటే అసభ్యంగా, అశ్లీలంగా మాట్లాడటం అలాగే అప్పుడుప్పుడు కొంతమంది ఏదో ముతక సామెత చెప్పినట్లు అని అనటం కూడా కనిపిస్తుంది. సభ్యసమాజం మెచ్చుకోని నీచమైన పోలికలతో ఉన్న సామెత అని దీనికర్థం. ఇలా ముతకతనం, ముతకమనిషి, ముతకభాషలను వ్యవహరిస్తుండటం పరిపాటి.

"https://te.wikiquote.org/w/index.php?title=జాతీయాలు&oldid=12029" నుండి వెలికితీశారు