కరువు జిల్లాగా పేరుపడిన మహబూబ్ నగర్జిల్లాకు చెందిన వలస కూలీలకుపాలమూరు కూలీ లని పేరు. వీరు ఉండని ప్రాంతం లేదు. వలస వెల్లని కాలం లేదు. చేయని పని ఉండదు. వీరి గురించి రాయని పాలమూరు కవిలేడు. ఎంత మంది కవులు, ఎంత రాసినా వొడవని దుఃఖం వారిది. తీరని వెతలు వారివి. తీరం లేని పయనం వారిది.

మేం మనుషులం
మీరంతా మరిచిపోయిన మనుషులం
మేం పాలమూరు కూలీలం
మేం మీలా
ఏ.సీ.గదులు కోరడం లేదు
నిలువ నీడ కోరుతున్నాం

మేం మీలా
నోట్ల కట్టలు కోరడం లేదు
నోటి ముద్ద కోరుతున్నాం

మేం మీలా
జిలుగు వెలుగుల చమ్కీలు కోరడం లేదు
కంతలు లేని
బొంతనే కోరుతున్నాం

మేం మీలా
పౌంటెన్లను కోరడం లేదు
గొంతు తడిపే నీటి చుక్క కోరుతున్నాం

మేం మీలా
సరదా కేకలు పెట్టటం లేదు
మలమల మాడే కడుపులతో
ఆకలి కేకలు పెడుతున్నాం

మేం మనుషులం
మీరంతా మరిచిపోయిన మనుషులం
మేం పాలమూరు కూలీలం

---పి.భారతి[1]

పాలమూరి కూలీపై వ్యాఖ్యలు

మార్చు
  • తమ రెక్కలు డొక్కలు క్రుంగిపోవగా దేబెలుగాక యుండి, తమ దేశముకై తనువొంచు పాలమూరు లేబరు మించు వారలిల లేరు.-----గంగాపురం హనుమచ్ఛర్మ[2].
  • కూడు గుడ్డ లేక వలసపోవు అమాయక జీవులు/కపటమెరుగని కర్మజీవులు----డా.బూర్గుల కేశవులు[3].
  • హైటెక్ సిటీ నిర్మాణానికి/ ఎన్ని పగళ్ళు ఎండలో కాలావో! ఎన్ని రాత్రుళ్ళు చలిలో ముడుచుకపోయావో!---పల్లాటి శ్రీకాంత్.[4].
 
*

పని ఎక్కడ సాగుతుంటే
మేమక్కడ కనిపిస్తాం
నెత్తిమీద గంపతోటి
చేతిలోన పలుగు పట్టి
మా రక్తం పంచుకుంటూ
పదిమందికి తోడ్పతుతాం
పాలమూరు కూలీలం
మేం పాలమూరు కూలీలం

మా చెమటల తడులు లేని
ప్రాజెక్టులు యిలను లేవు
ఏ దేశం ఏ రాజ్యం
ఏ ప్రాంతం చూసినా మేమక్కడ ఉంటాం
పాలమూరు కూలీలం
మేం పాలమూరు కూలీలం

----మాదిరాజు హరినందన్‌రావు.[5].


కట్టలూ, ఆనకట్టలూ కట్టే
కూలీ మనుషులు
ఇతరుల పచ్చదనం కోసం
తమ రక్తాన్ని స్వేదీకరించే
చెమట మనుషులు

ఎక్కడికైనా వెళ్ళి
పనిచేసే కలేజా ఉన్న
పాలమూరు లేబరుగా
బతుకులీడుస్తున్న
వలస పక్షులు

---ఎం.పి.రమేశ్ బాబు[6].

పాలమూరు లేబరు
ఉపన్యాసాలకు లేబిలు

ఎన్ని మారినా మారనిదొకటే
అది పాలమూరు లేబరు బతుకు

----డా.ఎం.రాములు.[7].

 

శ్రమైక జీవులం
కార్మికులం,కర్షకులం
కూడు కోసం, గూడు కోసం
దేశదిమ్మరులం
పాలమూరు కూలీలం

----డా.టి.మోహన్ సింగ్[8].


ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. పాలమూరు గోస,(మేం మనుషులం-పి.భారతి), సంపాదకులు& ప్రచురణ కర్తలు:కరువు వ్యతిరేక పోరాట కమిటి,మహబూబ్ నగర్ జిల్లా, జులై,2004,పుట-89
  2. మహబూబ్ నగర జిల్లా సర్వస్వం, (పాలమూరు మహా మండల ప్రశస్తి-గంగాపురం హనుమచ్ఛర్మ), సంపాదకులు:బి.ఎన్. శాస్త్రి, మూసి పబ్లికేషన్స్, హైదరాబాడ్,1993, పుట -1
  3. పాలమూరు కవిత,(పాలమూరు కూలీలం-డా.బి.కేశవులు), సంపాదకులు: భీంపల్లి శ్రీకాంత్, పాలమూరు సాహితి, మహబూబ్ నగర్, 2004, పుట-50
  4. పాలమూరు కవిత,(కూలన్న-పల్లాటి శ్రీకాంత్), సంపాదకులు: భీంపల్లి శ్రీకాంత్, పాలమూరు సాహితి, మహబూబ్ నగర్, 2004, పుట-66
  5. పాలమూరు కవిత,(ఎండిన డొక్కల సాక్షిగా-మాదిరాజు హ.నం.రావు), సంపాదకులు: భీంపల్లి శ్రీకాంత్, పాలమూరు సాహితి, మహబూబ్ నగర్, 2004, పుట-89
  6. పాలమూరు కవిత,(వలసపక్షులు-ఎం.పి.రమేశ్ బాబు), సంపాదకులు: భీంపల్లి శ్రీకాంత్, పాలమూరు సాహితి, మహబూబ్ నగర్, 2004, పుట-112
  7. పాలమూరు కవిత,(పాలమూరు లేబరు బతుకులు-డా.ఎం.రాములు), సంపాదకులు: భీంపల్లి శ్రీకాంత్, పాలమూరు సాహితి, మహబూబ్ నగర్, 2004, పుట-113
  8. పాలమూరు కవిత,(శ్రమైక జీవులం-డా.టి.మోహన్ సింగ్), సంపాదకులు: భీంపల్లి శ్రీకాంత్, పాలమూరు సాహితి, మహబూబ్ నగర్, 2004, పుట-154