సర్దేశాయి తిరుమలరావు

తెలుగు రచయిత, విమర్శకుడు, శాస్త్రవేత్త

సర్దేశాయి తిరుమలరావు (1928 - 1994) తెలుగు వాజ్మయంలో విలక్షణమైన విమర్శకుడు. భారతి మాసపత్రికలో కలగూరగంప శీర్షికలో, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక మొదలైన పత్రికలలో వ్యాసాలరూపంలోను, లేఖలరూపంలోను ఇతని విమర్శలు తెలుగు పాఠకులకు చిరపరిచితమే. కన్యాశుల్కము - నాటక కళ,సాహిత్యతత్వము - శివభారతదర్శనము అనే విమర్శ గ్రంథాలద్వారా ప్రసిద్ధుడు. తైలసాంకేతిక రంగంలో శాస్త్రజ్ఞుడిగా అంతర్జాతీయ ఖ్యాతిని గడించాడు.

వ్యాఖలు మార్చు

సర్దేశాయి తిరుమలరావు వివిధ సందర్భాలలో చేసిన వ్యాఖ్యలు ఆలోచన రేకెత్తించేవిగానో, హాస్యస్ఫోరకంగానో ఉంటాయి. వాటిలో కొన్ని వ్యాఖ్యలు[1]:

  • పెద్దబండలో అనవసరమైన రాతి పదార్థము చెక్కిపారవేసి శిల్పి చక్కని విగ్రహమునొకదానిని మన ఎదుట పెట్టును. వస్తుభావములను నట్టి రసాయనము(Chemicals)లకు ప్రతిభా ఉత్పత్తులను ప్రేరకము(Catalyst)లను చేర్చి, మేధస్సు అనే క్రియాకలశము(Reaction vessel)లో క్రియ(Reaction) చేసి, ఫలితములను(Products) విచక్షణత అను జల్లెడలో వడబోసి(Sieve of discretion) వచ్చిన కవితా సారమును(Essence of poetry) మనకు అందించును రసాయనికుడు(Chemist) అగు కవి.
  • ఆవేశముతో ప్రకటించు శాంతమే కవిత్వము.
  • కవిత్వము:
♦ పసికందు మొదటిసారి “అమ్మ” అని పల్కనేర్చినపుడు తల్లికి కల్గిన ఆనంద మీయవలెను.
♦ చలిలో గజగజ వణకుచున్న ముసలివానికి దుప్పటి కప్పినప్పుడు వాని కన్నుల వెలుగు జ్యోతిలో కన్పడు తృప్తివంటి తృప్తి నీయవలెను.
♦ తొలకరి చినుకులు చిటపట పడునపుడు పిల్లలు తలమీద చేతులు పెట్టుకొని బుడుగో బుడుగు అని అఱచుచు గుండ్రముగా తిరుగునప్పటి ఉత్సాహమీయవలెను.
♦ మార్గశీర్ష మాసమున, అంబటి పూట పచ్చికబయలులో బాలకుడగు పసులకాపరి గేదెపై వెనుకముందుగ కూర్చొని, భారతీయ జానపదసంగీతములకు సామాన్య రాగములలో ఒకటగు “భటియాలి”లో పిల్లనగ్రోవి ఊదుచున్నప్పటి దృశ్యానుభూతి నీయవలెను.
♦ కొత్తిమీర మెట్టచేనిలో కూర్చొనినపుడు, పుష్యమాస గోధూళివేళ, ఒకగాలి అల ఇటు దొరలినపుడు కలుగు చిత్రభావమును కలుగజేయవలెను.
♦ చీకటిలో అడవిలో పోవునపుడు అల్లంతదూరాన దీపము మినుకు మినుకమని కనబడినప్పటి ధైర్యము పోయవలెను.
♦ గ్రుడ్డివాని చేతి ఊతగఱ్ఱ వలె జీవగఱ్ఱ కావలెను.
♦ దేశమును రక్షించుటకు నడిచిపోవు అజ్ఞాత యోధునకు, సంఘమును రక్షించుటకు నడుముకట్టిన అసహాయశూరునకు జపాసూత్రము కావలెను.
♦ అన్నమాచార్యులు ఆకఁటివేళ అను కీర్తనములో చెప్పిన వేళలన్నిటికి, హరినామము లేకున్నను నేనున్నాను అని భరవస ఈయగల్గి ఉండవలెను.
♦ అశక్తులను శక్తులనుగా మార్పగల్గి ఉండవలెను.
  • కవిత్వమొక లంఘనాఫలకం (స్ప్రింగ్‌బోర్డ్). దానిమీద నిలబడి మనుష్యుడు ప్రగతిపథమున కెగుర గలిగి ఉండవలెను.
  • భగవంతుడు సున్నా అయితే, భక్తులు హేతువాద పరీక్షలో అదే విలువగల మార్కులు తెచ్చుకొను పరీక్షాభ్యర్థులు.

మూలాలు మార్చు

  1. జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు-నాగసూరి వేణుగోపాల్, కోడీహళ్లి మురళీమోహన్ - అబ్జ క్రియేషన్స్, హైదరాబాదు - మే 2013
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.